20 మార్చి, 2012

నలదమయంతుల వియోగం


దమయంతిని వదిలివెళ్ళిన నలుడు అడవిలో ప్రయాణిస్తుండగా, అడవి అంతటా దావానలం వ్యాపించింది. ఆ మంటల మధ్యనుండి "రక్షించండి రక్షించండి" అన్న ఆర్తనాదం వినిపించింది. ఆ ఆర్తనాదం విని నలుడు అగ్నికీలల నడుమ ఉన్న నాగకుమారుని రక్షించాడు. ఆ పాము నలుని కాటు వేసింది. పాము కాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షం అయి నలునితో "నలమహారాజా! నా పేరు కర్కోటకుడు. నేను నిన్ను కాటువేసానని భయపడకు. ఇక నిన్ను ఎవరూ గుర్తించరు. పాముకాటు నిన్ను ఏమీ చేయదు. నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది, నీ భార్య నీకు దక్కుతుంది, నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా, నన్ను తలచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది.
   దానిని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది. నీకు మరొక విషయం చెప్తాను.. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన రుతుపర్ణుని రాజ్యం ఉంది. నీవు అక్కడికి వెళ్ళు. బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రధసారధిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయం అనే విధ్యను ఇచ్చి అతనినుండి అక్షహృదయం అనేవిద్యను గ్రహించు", అని చెప్పి కర్కోటకుడు వెళ్ళాడు. నలుడు ఋతుపర్ణుని వద్ద సారధిగా చేరాడు. అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండి పెట్టసాగాడు. నలునికి జీవలుడు సహాయకుడుగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా, నలుడు ఎప్పుడూ దమయంతిని తలచి దుఃఖిస్తూ ఉండేవాడు. ఒకరోజు నలుడు దమయంతిని తలచుకుని దుఃఖిస్తూండగా జీవలుడు విని ఈ వికృతరూపి ప్రియురాలు ఎంత వికృతరూపంతో ఉంటుందో అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి, విషయం ఏమిటని అడిగాడు. అందుకు నలుడు జీవలునితో "అయ్యా నాకు ఒక ప్రేయసి కూడానా. నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తుండగా చూసాను. అతనిని అనుకరిస్తూ ఏడుస్తున్నాను" అన్నాడు.
         విదర్భదేశంలో ఉన్న భీమునికి నలుని విషయాలు తెలిసాయి. తన కూతురు, అల్లుడు ఏమయ్యారో అని పరితపించాడు. వారిని వెదకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపించాడు. ఎన్నో బహుమానాలు ప్రకటించాడు. ఛేదిదేశం చేరిన బ్రాహ్మణుడు, దమయంతి నుదుటన ఉన్న పుట్టుమచ్చని చూసి ఆమెను గుర్తించాడు. అతడు దమయంతితో "అమ్మా! నేను నీ తండ్రి వద్దనుండి వస్తున్నాను. అక్కడి వారంతా క్షేమం. నేను నీ సోదరుని మిత్రుడను" అనగానే దమయంతి వారిని తలచుకుని పెద్దగా రోదించింది. అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి "బ్రాహ్మణోత్తమా! ఈమె ఎవరి భార్య? ఎవరి కూతురు? ఇలా ఉండటానికి కారణం ఏమిటి?" అని అడిగింది. అందుకు అతడు "అమ్మా! ఈమె విదర్భరాజు కుమార్తె. నలచక్రవర్తి భార్య. ఈమె పేరు దమయంతి. అతడు విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికివచ్చి ఈమెను గుర్తించాను" అన్నాడు. అది విని దయంతిని కౌగలించుకున్న రాజమాత "దమయంతీ! నీవు నాకు పుత్రికా సమానురాలివి. నేను, నీ తల్లి దశార్ణరాజు కుమార్తెలము. నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది. నేను వీరబాహును వివాహమాడాను" అన్నది. అందుకు అందరూ ఆనందపడ్డారు. దమయంతి బ్రాహ్మణునితో పుట్టింటికి ప్రయాణం అయింది.
                 రాజసౌధంలో ఉన్నా దమయంతి భర్తృవియోగంతో బాధపడుతూనే ఉంది. ఆమె తనతండ్రితో "నా భర్తను తక్షణం వెతికించండి. ఆయన లేకుండా నేను బ్రతక లేను" అన్నది. భీముడు వెంటనే బ్రాహ్మణులను పిలిచి నలుని వెతకమని చెప్పాడు. వారితో దమయంతి ఇలా చెప్పింది. "నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక, మారు వేషంలో ఉంటాడు. మీరు వెళ్ళిన రాజ్య సభలలో ఈ విధంగా ప్రకటించండి. "నీవు సత్యసంధుడవు కాని, నీ సతిని వంచించావు. ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళావు. అలా చెయ్యడం ధర్మమా? నాపై కరుణ చూపు" అని చెప్పండి. ఈ మాటకు ఎవరైనా రోషపడి బదులిస్తే, నా వద్దకు వచ్చి చెప్పండి" అన్నది.
  అలా నలుని వెదకడానికి వెళ్ళినవారంతా నలుని జాడ తెలుపక పోయినా, వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో "అమ్మా! నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడు, సారధి అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకుని, 'అయ్యా! భర్త కష్టాలలో ఉన్నా సహించి, ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది' అన్నాడు" అని దమయంతితో చెప్పాడు. దమయంతి ఆలోచించగా అతడు నలుడు కాకపోతే అలా ఎందుకు బదులిస్తాడు అనుకుంది. తన అనుమానం దృఢపరచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవడనే బ్రాహ్మణుని పిలిపించింది. "సుదేవా నీవు ఋతుపర్ణుని రాజుతో, "రాజా! భీముడు తన అల్లుని కొరకు వెతికించినా ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలం లోని రాజులంతా వస్తున్నారు. మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు" అని చెప్పు" అని చెప్పి పంపింది. సుదేవుడు ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి