5 జూన్, 2011

దధీచి మహర్షి కథ



దధీచి మహర్షి కథ


పూర్వం పరా త్వష్ట అనే దంపతులుండే వారు. ఎంతకాలం గడచినా వారికి సంతానం కలగలేదు. ఆమె పుత్రప్రాప్తికై పరమేశ్వరునకు తపము చేయసాగింది. ఏకాగ్ర చిత్తంతో మహాదేవుని ధ్యానంచేసింది. వేయి సంవత్సరముల పరాసాధ్వి యొక్క తపస్సునకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమైనాడు. ఆమె “పరమశివా! శూరుడు శస్త్రాస్త్రాలకు చంపబడని వాడు విప్రదానవ రూపధరుడు అయిన పుత్రుని ప్రసాదించు” అని కోరినది.
పరమేశ్వరుని వరానుసారం ఆమెకు వృత్రుడనే పుత్రుడు కల్గినాడు. స్వయంగా శుక్రాచార్యులవారే ఆ వృత్రునికి విద్యాబోధచేసినాడు. వరప్రభావంతో గురుకృపతో మహాతేజసంపన్నుడైనాడు వృత్రుడు. కాని అతనిలో బలగర్వం ఎక్కువయ్యింది. చివరికి దేవేంద్రుని మీద దండెత్తాడు! అమిత బలవంతుడైన వృత్రుడు దేవాధిపతి అయిన ఇంద్రుడు ౫౦౦౦ యేండ్లు యుద్ధం చేశారు. చివరికి వృత్రుడు విజయం పొందాడు.

 పరాజితుడైన శచీపతి బ్రహ్మలోకం చేరాడు. మించిన బలగర్వం మత్సరంగా మాఱగా వృత్రుడు శుక్రాచార్యునితో ఇలా అన్నాడు “యుద్ధంలో ఓడిన ఇంద్రుడు బ్రహ్మలోకం వెళ్ళాడు. నేనూ అక్కడి వెళ్ళాలి. దారిచెప్పండి”. శుక్రుడిలా బదులిచ్చాడు “రాక్షసనాథా! నీవు బ్రహ్మలోకానికి పోలేవు. తృప్తికి మించిన సంపద లేదు. త్రిలోకాధిపత్యంతో సంతృప్తిపడు”. “ఇంద్రుడున్నంత వరకూ నాకు సుఖంలేదు. వాడిని నాశనం చేయాలి. ఇంద్రుడికి బ్రహ్మలోకం వెళ్ళే అర్హత ఎలా వచ్చింది? నాకెందుకు లేదు” అని వృత్రుడన్నాడు. “పూర్వం పవిత్రమైన నైమిశారణ్యంలో 1000 సంవత్సరాలు ఇంద్రుడు శివునికై తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు. అంతటి తపశ్శాలి కనక బ్రహ్మలోక ప్రవేశం ఇంద్రునికి శంకరుని అనుగ్రహం వలన కలిగింది” అని చెప్పాడు శుక్రుడు. వెంటనే వృత్రుడు నైమిశారణ్యం చేరి తపస్సు ఆరంభించాడు.

దుష్టుడైన వృత్రుని సంహారమునకు శ్రీకారం చుట్టిన మహావిష్ణువు ఇంద్రునితో ఇలా అన్నాడు “సురేశ్వరా! పరమేశ్వరుని వర ప్రభావం వలన వృత్రుడు శస్త్రాస్త్రాలకు అవధ్యుడు. సరస్వతీ నదీ తీరంలో పరమనిష్ఠతో దధీచి మహర్షి తపమాచరిస్తునాడు. నూరుమూరల ప్రమాణంలో ఉన్న ఆ మహనీయుని వెన్నెముక వ్రజ్రముకంటే రెండు రెట్లు పటిష్టమైనది. ఆ దయాళువును లోకహితార్థము తన అస్థిని ఈయమని ప్రార్థీంచండి”. నారాయణుని అనుజ్ఞ తీసుకుని దేవేంద్రుడు కురుక్షేత్రంలో నదీతీరంలో ఉన్న మహర్షిశిరోమణి వద్దకు వెళ్ళాడు.

shriharitells.jpg

దధీచి మహర్షి ఇంద్రుని రాకకు కారణమేమని అడిగినాడు. ఇంద్రుడు పూర్వ వృత్తాంతమంతయు తెలిపి ఇలా అన్నాడు “మహానుభావా! వృత్రుని ఆగడాలు మితిమీఱుతున్నాయి. అతని సంహరించకపోతే విబుధ (పండిత) వినాశం తప్పదు. దయచేసి మీ అస్థిని మాకు ప్రసాదించండి”.

ఇంద్రుడు చేసిన ప్రార్థన విని దధీచి మహర్షి మహదానందంతో పొంగిపోయాడు. లోక హితార్థము తన శరీరం వినియోగపడటం కన్నా కావలిసినది ఏమున్నదన్నాడు. యోగశక్తితో శరీరత్యాగం చేశాడు! దధీచి మహర్షి చేసిన అసామాన్యమైన త్యాగానికి విభ్రమితుడైన వేల్పుదొర దధీచికి నమస్కరించాడు. అస్థితో వజ్రాయుధాన్ని చేయించి లోకభీకరుడైన వృత్ర సంహారం చేశాడు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి